Sri Vinayaka Vrata Kalpam (Part 1) – వినాయక వ్రత కల్ప విధానము 1


వినాయక వ్రత కల్ప విధానము


 భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడు పుట్టిన రోజని కొందరు, గణాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు భావిస్తారు. మహేశ్వరాది దేవతా గణాలకు గణపతి ప్రభువు. అంటే సకలదేవతలకు ఆయనే ప్రభువన్న మాట.

శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు. ఆ స్వామిని తలచుకుంటే చాలు తలపెట్టిన కార్యక్రమం ఏదైనా ఎలాంటి విఘ్నం లేకుండా విజయం సాధిస్తుంది. ఏటా భాద్రపద చవితి నాడు ప్రతి ఇంట్లో పాలవెల్లి కట్టి గణేషుని పూజించి, వీధుల్లో పందిళ్లు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకోవడం ఆనాదిగా వస్తున్న ఆచారం. ఏ కార్యంలోనైనా ప్రథమ పూజలందుకునే వినాయకుడంటే అందరికి ఎంత భక్తిభావమో, తన భక్తుల పట్ల గణపతికి కూడా వల్లమాలిన వాత్సల్యం. ఆ స్వామి రూపం, ఆ స్వామి నామాలు మనకు ఎన్నో విషయాలను ప్రబోధిస్తాయి. హిందువులకు తొలి పండుగ వినాయకచవితే. ప్రతీవారు తమ ఇంట్లో స్వామిని పూజిస్తారు. వినాయక వ్రతం, పూజా విధానం ఎలా చేయాలో పండితులు చెబుతున్నారు.

భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతమాచరించవలెను. ప్రతివారు ఉదయమునే లేచి, గృహమును ఆవుపేడతో అలికి ముగ్గులు వేసి, మామిడి తోరణములు మున్నగువానితో అలంకరించవలెను. వ్రతం చేయాలనుకునే ప్రదేశంలో పీట వేసి, పసుపుతో విఘ్నేశ్వరుని చేసి, తమలపాకుల చివర తూర్పు వైపుకు గానీ, ఉత్తరం వైపుకు గానీ ఉంచుకోవాలి. ఒక పళ్లెంలో బియ్యం పోసుకుని వాటిపై తమలపాకులను పెట్టుకోవాలి. మండపమును పాలవల్లి మున్నగు వానితో బాగుగా అలంకరించి అందు వినాయక ప్రతిమలనుంచవలెను.

పీటపై వినాయుకుడి విగ్రహాన్ని ఉంచుకుని, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, దాన్ని విఘ్నేశ్వరుని తలపై వచ్చేలా తాళ్లు కట్టి పైన కట్టుకోవాలి. పాలవెల్లిపై పత్రి వేసుకుని పాలవెల్లి నలువైపులా మొక్కజొన్ను పొత్తులను కట్టుకుని, పళ్లతో అలంకరించుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములు, గారెలు, పాయసం మొదలైన పిండివంటలు చేసుకుని దగ్గర పెట్టుకోవాలి. వినాయకుడి ప్రతిమ ఎదురుగా పీటపై కొన్ని బియ్యం పోసుకుని దానిపై రాగి, వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసి, పాత్రపై జాకెట్టు గుడ్డ వేసి, మామిడాకులు కొన్ని ఉంచి దానిపై కొబ్బరికాయ ఉంచి కలశం ఏర్పాటు చేసుకోవాలి.

పూజకు కావలసిన పూజా సామాగ్రి
పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం  లేదా చక్కెర, పంచామృతం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, దీపారాధనకు వత్తులు, 21 రకాల ఆకులు (పత్రి), ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరిణ, పళ్లెం పెట్టుకోవాలి (ఆచమనం చేయడానికి). మూడు తమలపాకులు, రెండు వక్కలు, రెండు పళ్ళు, దక్షిణ ఉంచుకోవాలి. ఆచమనం చేసిన తరువాత చేతులు తుడుచుకోవడానికి ఒక తువ్వాలు. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని పీటపై కూర్చోవాలి.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే !!

మూడు చిన్న గిన్నెలను గాని గ్లాసులను గాని తీసుకొని మొదటిదానిలో పాద్యజలము, రెండవదానిలో ఆచమన జలము, మూడవదానిలో అర్ఘ్యజలమునుంచవలెను. అర్ఘ్యమిచ్చునప్పుడు ఏదైనా పండును తీసుకొని నీటితో కలిపి గిన్నెలో వదలవలెను. మధుపర్కము సమర్పించునపుడు తేనె, పాలు, నెయ్యి కలిపి వినాయకునకు చూపవలెను.

పంచామృత స్నానము చేయించునపుడు, తేనె, నెయ్యి, పటికబెల్లము, పెరుగు, పాలు కలిపి అయ్యవారి విగ్రహమునకు అభిషేకము చేయవలెను. శక్తియున్నవారు పాలు, పెరుగు, పండ్లరసము, గంధములు కూడా అభిషేకము చేయవచ్చును. ప్రతి అభిషేకము తరువాత శుద్ధోదక స్నానము చేయించవలెను. ప్రతి శ్లోకమును చదివి శ్లోకము దిగువ యిచ్చినట్లు ఉపచారములు చేయవలెను.

ఏకవింశతి పత్రములు –
వివిధ ఓషధులను గుర్తించుటకు భాద్రపదమాసము అనువైన కాలము. ఇరవై ఒక్క రకముల పత్రిని సేకరించుట అనగా ఇరవైఒక్క రకముల వనౌషధులతో పరిచితి ఏర్పరుచుకొనుటయే. ఓషధీ పరిజ్ఞానముకూడ అవసరమైన విద్యయే. సేకరించుట దేవపూజకు కాబట్టి శ్రద్ధతో జరుగును.

1. సూచీ – అనగా కుశమ్, కుశదర్భ, బర్హి, సూచ్యగ్ర మున్నగునవి దీని పర్యాయ పదములు, శుభాశుభ కర్మలలో దీనిని హెచ్చుగా వాడెదరు.
2. బృహతీ – నేలములక, పెద్దములక, వాకుడు మున్నగునవి యిందులో భేదములు.
3. బిల్వ – మారేడు, శివునకు ప్రియమైనది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో సాటిలేనిది.
4. దూర్వా – అనగా గరిక.
5. దుత్తూర – ఉమ్మెత్త, విషాన్ని హరించడంలో పెట్టింది పేరు.
6. బదరీ – రేగు.
7. అపామార్గ – ఉత్తరేణి.
8. తులసి – శివకేశవులకిద్దరకు ప్రీతికరమైనది.
9. చూతపత్రం – మామిడి ఆకు.
10. కరవీర – గన్నేరు, వాడగన్నేరు.
11. విష్ణుక్రాంత – నీలవర్ణపు చిన్న చిన్న పూలు పూయును.
12. దాడిమీ – దానిమ్మ
13. దేవదారు – ఆకులు, చిన్నవిగా, గుండ్రంగా, సువాసన కలిగి ఉంటాయి.
14. మరువక – మరువము, చక్కనివాసన గల పత్రములు కలది
15. సింధువార – వావిలి.
16. జాజిపత్ర – జాజిపత్రి, జాపత్రి ఒక చెట్టువే. జాజిపత్రి ఆకు, జాపత్రి కాయ మీదితొడుగు. పాఠభేదంతో మాలతీలతకు అర్థం చెప్పుకోవాలని కొందరు అంటున్నారు.
17. గండవీ – తెల్లగరికె.
18. శమీ – జమ్మి
19. అశ్వత్థ – రావి.
20. అర్జున – మద్ది.
21. ఆర్కపత్రం – జిల్లేడు.

ఇట్లు ఇరవై ఒక్క పత్రములతో పూజ చేయవలెను. పూజకోసం సేకరిస్తూ పై ఓషధులతో పరిచితి చిన్ననాటనే ఏర్పరచుకోవడం బ్రతుకుతెరువు నేర్చుకొనడమే.

Comments